image



40వ రాజుగా బ్రిటన్‌లో ఛార్లెస్‌-3 పట్టాభిషేకం




 
→అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభవంగా బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 పట్టాభిషేకం జరిగింది. 
 
→లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ అబేలో అత్యంత ఆడంబరంగా జరిగిన కార్యక్రమంలో 74 ఏళ్ల రాజుకు అర్చిబిషప్‌ కిరీట ధారణ చేశారు. 
 
→దీంతో 40వ రాజుగా ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించినట్లైంది. 
 
→పట్టాభిషేకంలో మొదటిదైన ‘కాల్డ్‌ టు సర్వ్‌’ కార్యక్రమాన్ని హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దలతో కలిసి కాంటర్‌బరీ అర్చిబిషప్‌ జస్టిన్‌ వెల్బీ
నిర్వహించారు. 
 
→ఈ సందర్భంగా బ్రిటన్‌ తొలి హిందూ ప్రధాని అయిన ప్రధాని రిషి సునాక్‌ బైబిల్‌లోని వాక్యాలను చదివారు. 
 
→వెంటనే లాంఛనంగా రాజు, రాణి వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఛార్లెస్‌-3 ప్రమాణం చేశారు. 
 
→బ్రిటన్‌ ప్రజలను న్యాయం, దయతో పాలిస్తానని, అన్ని విశ్వాసాల ప్రజలు బ్రిటన్‌లో స్వేచ్ఛగా జీవించేందుకు అవకాశం కల్పిస్తానని బైబిల్‌ సాక్షిగా ప్రమాణం చేశారు. 
 
→చర్చి ఆఫ్‌ ఇంగ్లాండ్‌కు నమ్మకస్థుడైన క్రిస్టియన్‌గా ఉంటానని రెండో ప్రమాణం చేశారు. ఆ తర్వాత బైబిల్‌ను ముద్దాడారు. 
 
→ ప్రమాణం, ప్రార్థనల తర్వాత 1300 సంవత్సరంలో ఎడ్వర్డ్‌ చేయించిన సింహాసనాన్ని రాజు ఛార్లెస్‌-3 అధిష్ఠించారు. 
 
→అనంతరం ఛార్లెస్‌-3ను జరూసలమ్‌ నుంచి తెచ్చిన పవిత్ర నూనెతో అభిషేకించారు. చేతులు, ఛాతీ, తలపై నూనె పోశారు. 
 
→ఇదంతా తెరచాటున జరిగింది. నూనెతో అభిషేకం పూర్తయిన తర్వాత బంగారు తాపడంతో చేసిన మహారాజ గౌన్‌ ధరించి సింహాసనంపై ఛార్లెస్‌-3 కూర్చున్నారు. 
 
→ఆ తర్వాత శిలువతో ఉన్న గోళాకారంలో ఉండే బంగారు రాజముద్ర, రాజదండంను ఆర్చి బిషప్‌ ఆయనకు అందించారు. 
 
→కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగిన అనంతరం కిరీట ధారణ చేశారు. 
 
→ఆ తర్వాత సభికులంతా ‘గాడ్‌ సేవ్‌ కింగ్‌’ అంటూ నినాదాలు చేశారు. 
 
→అనంతరం 75 ఏళ్ల రాణి కెమిల్లాపై పవిత్ర నూనె చల్లి నిరాడంబరంగా కిరీట ధారణ చేశారు. 
 
→ఆమె ధరించిన కిరీటంలో కోహినూర్‌ మినహా 2,200 వజ్రాలను పొదిగారు. 
 
→రెండు గంటల పాటు జరిగిన పట్టాభిషేక కార్యక్రమం అబే గంటలు మోగడంతో పూర్తయింది. 
 
→ఆ తర్వాత రాజు, రాణి అబే నుంచి బకింగ్‌హాం ప్యాలెస్‌కు బంగారు పూతతో ఉన్న గుర్రపు బగ్గీపై వెళ్లారు. 
 
→ఛార్లెస్‌-3 1948 నవంబరు 14వ తేదీన జన్మించారు. అత్యంత పెద్ద వయసులో రాజుగా బాధ్యతలు చేపట్టారు. 
 
→కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి 1970లో డిగ్రీ పట్టా అందుకున్నారు. డిగ్రీ అందుకున్న తొలి రాజుగా ఆయన నిలిచారు. 
 
→బ్రిటిష్‌ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో పైలట్‌ శిక్షణ పొంది నౌకాదళంలో పని చేశారు. 1976లో సైనిక సేవల నుంచి రిటైరయ్యారు. 
 
→మొదట డయానా అనే సామాన్య మహిళను పెళ్లాడారు. వారికి విలియం, హ్యారీ అనే ఇద్దరు కుమారులున్నారు. ఆ తర్వాత డయానాకు విడాకులిచ్చారు. 
 
→2005లో అప్పటి రాణి ఎలిజబెత్‌-2 అనుమతితో తన చిరకాల మిత్రురాలు కెమిల్లాను ఛార్లెస్‌-3 వివాహం చేసుకున్నారు. 
 
→ఛార్లెస్‌-3 కన్నా కెమిల్లా ఏడాది పెద్ద.
 



International