image



ముగ్గురి డీఎన్‌ఏలతో శిశువు జననం




→వంశపారంపర్యంగా వచ్చే కొన్ని అరుదైన జన్యువ్యాధులను నివారించడం ద్వారా ఆరోగ్యవంతమైన చిన్నారుల జననానికి దోహదపడే ప్రయోగాత్మక విధానాన్ని బ్రిటన్‌ పరిశోధకులు తాజాగా విజయవంతంగా అమలుపరిచారు.
 
→తమ దేశ చరిత్రలో తొలిసారిగా ముగ్గురు వ్యక్తుల డీఎన్‌ఏను పంచుకుంటూ శిశువులు జన్మించేలా చేశారు. ‘మైటోకాండ్రియా దానం’ అనే వినూత్న విధానాన్ని ఇందుకు ఉపయోగించారు.
 
→బ్రిటన్‌లోని ‘మానవ ఫలదీకరణ, పిండోత్పత్తి ప్రాధికార సంస్థ’ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.ఈ విధానంలో శిశువుల సంఖ్య 5 కంటే తక్కువ అని పేర్కొంది.
 
→ ఫాల్టీ మైటోకాండ్రియాతో బాధపడుతున్న మహిళల సంతానానికి ఇబ్బందులు తలెత్తకుండా నివారించేందుకు పరిశోధకులు వినూత్న విధానాన్ని ఆవిష్కరించారు.
 
→ఇందులో తొలుత బాధిత మహిళ అండం నుంచి జన్యుపదార్థాన్ని సేకరిస్తారు. ఆ పదార్థాన్ని దాత అండంలో ప్రవేశపెడతారు. అంతకుముందే దాత అండం నుంచి కీలక జన్యుపదార్థాన్ని తొలగిస్తారు. ఆరోగ్యవంతమైన మైటోకాండ్రియాను (ఇందులోనూ దాత డీఎన్‌ఏ కొంత ఉంటుంది) మాత్రం అందులోనే ఉంచుతారు.
 
→ఆపై అండాన్ని ఫలదీకరణం చెందించి తల్లి గర్భంలో ప్రవేశపెడతారు. ఈ విధానంలో జన్మించే శిశువులో దాతకు సంబంధించిన జన్యుపదార్థం 1% కంటే తక్కువే ఉంటుంది. తండ్రితో కలిపితే మొత్తంగా ముగ్గురి డీఎన్‌ఏ శిశువులో ఉంటుందన్నమాట. 
 
→మైటోకాండ్రియా సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలు ఈ విధానం ద్వారా ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందొచ్చు. అయితే వంశపారంపర్యంగా వచ్చే లోపాలను అధిగమించేందుకు ఇతర మార్గాలేవీ అందుబాటులో లేనప్పుడు మాత్రమే బాధితులకు ఈ సాంకేతికతను ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తామని బ్రిటన్‌ పరిశోధకులు చెబుతున్నారు. మైటోకాండ్రియా దానం విధానంలో ప్రపంచంలో తొలి శిశువు జన్మించినట్లు 2016లోనే అమెరికా ప్రకటించడం గమనార్హం. 
 



International