image



అమెరికాలో ‘టైటిల్‌ 42’ ఎత్తివేత




→అమెరికాలో ఆశ్రయం కోరేవారిపై ‘టైటిల్‌ 42’ పేరుతో ఇప్పటివరకు కొనసాగిన ఆంక్షలు ముగిశాయి. 
 
→దీని స్థానంలో కొత్త శరణార్థి విధానాన్ని అమెరికా ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. 
 
→మెక్సికోతో పాటు ఇతర దేశాల నుంచి అమెరికాకు శరణార్థుల తాకిడి గత కొన్నేళ్లుగా విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. 
 
→వీటిని కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం నిరంతరం చర్యలు చేపడుతూనే ఉంది. 
 
→ఈ క్రమంలో కొవిడ్‌-19 విజృంభణ సమయంలో శరణార్థులపై ‘టైటిల్‌ 42’ పేరుతో అమెరికా విధించిన ఆంక్షల గడువు ముగిసింది. 
 
→దీని స్థానంలో బైడెన్‌ ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడంతో అమెరికా సరిహద్దుకు భారీ సంఖ్యలో వలసదారులు తరలివస్తున్నారు.
 
→కరోనా వేళ అత్యవసర ఆరోగ్య పరిస్థితిలో అమెరికా ప్రభుత్వం ‘టైటిల్‌ 42’ నిబంధనను తీసుకొచ్చింది. 
 
→2020 మార్చి నెలలో ట్రంప్‌ ప్రభుత్వం తెచ్చిన ఈ విధానం ప్రకారం.. అమెరికా - మెక్సికో సరిహద్దుకు వచ్చే వలసదారులను తిరిగి వెనక్కి పంపించడంతో పాటు శరణు కోరడాన్ని తిరస్కరించవచ్చు. 
 
→ఇది అమల్లోకి వచ్చినప్పటి నుంచి సుమారు 28 లక్షల మంది వలసదారులను తిరస్కరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 
 
→అయితే, శరణార్థులను నిలువరించినప్పటికీ చట్టపరమైన చర్యలు లేకపోవడం వచ్చిన వారే మళ్లీ మళ్లీ వచ్చేందుకు కారణమయ్యింది.
 
→మరోవైపు వెనెజువెలా, హైతీ, నికరాగువా, క్యూబా దేశాలకు చెందిన వారిని నెలకు 30 వేల మందికి అనుమతి ఇస్తామని అమెరికా వెల్లడించింది. 
 
→గ్వాటెమాలా, ఎల్‌ సాల్వెడార్, హోండూరస్‌ దేశాలకు చెందిన వారినైతే లక్ష మందిని అనుమతిస్తామని తెలిపింది. 
 
→ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికే తొలి ప్రాధాన్యం ఉంటుంది. 
 
→వీటితో పాటు సీబీపీ వన్‌ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఇతర వలసదారులనూ అనుమతిస్తారు. 
 
→యాప్‌లో ప్రస్తుతం రోజుకు 750 మందిని అనుమతిస్తున్నారు.
 



International