image



జపాన్‌ రేడియోధార్మిక జలాల విడుదలకు ఐఏఈఏ అనుమతి




→సునామీ కారణంగా దెబ్బతిన్న జపాన్‌ అణు కర్మాగారానికి సంబంధించి శుద్ధి చేసిన రేడియోధార్మిక వ్యర్థ జలాలను సముద్రంలోకి వదిలేందుకు ఐరాసకు చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) అనుమతించింది.
 
→అవి అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడే ఉన్నాయని, ఆ జలాల వల్ల పెద్దగా ప్రతికూల ప్రభావాలేవీ ఉండబోవని పేర్కొంది. 
→అయితే జపాన్‌ ప్రణాళికలను చైనా, దక్షిణ కొరియా, పసిఫిక్‌లోని కొన్ని ద్వీప దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ప్రజారోగ్యానికి, సముద్ర పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని చెబుతున్నాయి.
 
→ జపాన్‌ మత్స్యకారులు కూడా దీనిపై ఆందోళన చెందుతున్నారు. తాము సరఫరా చేసే చేపల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతాయని వారు చెబుతున్నారు. 
→ఫుకుషిమా వ్యర్థ జలాలపై రెండేళ్ల సమీక్ష అనంతరం రూపొందించిన తుది నివేదికను ఐఏఈఏ అధిపతి రఫేల్‌ గ్రాసీ, జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిడాకు సమర్పించారు.
 
దీన్ని శాస్త్రీయంగా, నిష్పక్షపాతంగా, సమగ్రంగా రూపొందించామని గ్రాసీ తెలిపారు. ఈ వ్యర్థ జలాల విడుదల అంశం సామాజిక, రాజకీయ, పర్యావరణపరమైన ఆందోళనలకు కారణమైనట్లు ఐఏఈఏ గుర్తించినట్లు నివేదిక పేర్కొంది.
 
ప్రస్తుతం రూపొందించుకున్న ప్రణాళికల ప్రకారం ఈ నీటిని సముద్రంలోకి వదలడం వల్ల ప్రజలు, పర్యావరణంపై చాలా నామమాత్రపు రేడియోధార్మిక ప్రభావం ఉంటుందని తెలిపింది. 
 
→ఈ జలాల విడుదలకు ఉపయోగించే సాధన సంపత్తి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఈ నీటిలో ఎక్కువగా సీజియం, ఇతర రేడియోధార్మిక పదార్థాలు ఉంటాయి. చాలావరకు వీటిని వడగట్టేస్తారు.
 
→ట్రిటియం ఐసోటోప్‌ను మాత్రం నీటి నుంచి వేరు చేయడం చాలా కష్టం. అందువల్ల సముద్రపు నీటితో దాన్ని వంద రెట్లు పలుచగా చేసి, ఆ తర్వాతే పసిఫిక్‌ జలాల్లోకి వదులుతామని జపాన్‌ చెబుతోంది.
 
→ఫలితంగా ఆ వ్యర్థ జలాల్లో ట్రిటియం పరిమాణం అంతర్జాతీయంగా అమోదించిన స్థాయి కన్నా తక్కువగానే ఉంటుందని వివరించింది. 
 
→2011 మార్చి 11న వచ్చిన భూకంపం, సునామీ కారణంగా జపాన్‌లోని ఫుకుషిమా అణుకేంద్రంలో మూడు రియాక్టర్లు ధ్వంసమయ్యాయి. అప్పట్లో 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
 
→రియాక్టర్లను చల్లబర్చేందుకు వాడిన జలాలు రేడియోధార్మికతతో కలుషితమై, లీకయ్యాయి. ఈ నీటిని వెయ్యి ట్యాంకుల్లో నిల్వ ఉంచారు. వీటిని ఇప్పుడు క్రమంగా సముద్రంలోకి విడుదల చేస్తారు.
 
→ ఇందుకోసం సాగరం కింద నిర్మించిన ఒక సొరంగాన్ని ఉపయోగించుకుంటారు. ఈ ప్రక్రియను ఐఏఈఏ పర్యవేక్షిస్తుంది.
 



International